నేడు దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ గారి వర్ధంతి..

 @శ్రీనివాస్@


తెలుగు చిత్రసీమ వెలుగును దశదిశలా ప్రసరింపచేసిన అరుదైన  దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు..



ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్‌.వి. ప్రసాద్‌ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన  ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసారు.


ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఊరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.


ఇక 1908 జనవరి 17న జన్మించిన ఎల్‌.వి.ప్రసాద్‌ వివాహం సౌందర్య మనోహరమ్మతో జరిగింది. ఒక రోజు ఆయన సినిమాల్లో నటించాలనే కోరికతో జేబులో 100రూ.లతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరాడు. ముంబాయికి వెళ్లిన ఆయనకు ఎంతో కష్టపడగా చివరికి ఆలం ఆరా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.


దేశంలోనే తొలి టాకీ సినిమా అయిన ఈ చిత్రంలో ఎల్‌.వి.ప్రసాద్‌ ఓ పాత్ర చేశారు. ఈ చిత్రంలో నటించినందుకుగాను ఎల్‌.వి.ప్రసాద్‌కు నెలకు 30 రూపాయలను అందజేశారు. ఆ తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం కాళిదాస, తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో ఆయన నటించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఎల్‌.వి.ప్రసాద్‌ 1950లో విడుదలైన విజయ పిక్చర్స్‌ వారి షావుకారు సినిమాకు దర్శకత్వం వహించి ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఎన్టీరామారావు, జానకి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రసాద్‌ ప్రొడక్షన్‌ను నెలకొల్పిన ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో మిలన్‌, ఖిలోనా, ససురాల్‌, ఏక్‌ దూజే కె లియే వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు.


సినిమాలు..


నటునిగా..


        స్టార్ ఆఫ్ ది ఈస్ట్ (Star of the east (Silent)) - అసంపూర్తి.


        1931 : ఆలం ఆరా - మొదటి హిందీ టాకీ సినిమా


        1931 : కాళిదాస్ - మొదటి తమిళ టాకీ సినిమా


        1931 : భక్తప్రహ్లాద - మొదటి తెలుగు టాకీ సినిమా


        1933 : సీతా స్వయంవర్ (హిందీ)


        1940 : బోండాం పెళ్ళి (తెలుగు)


        1940 : చదువుకున్న భార్య (1940) (తెలుగు)


        1982 : రాజా పార్వాయి (తమిళం)


దర్శకునిగా..


        మిస్సమ్మ (1955)

        గృహ ప్రవేశం (1947)

        పల్నాటి యుద్ధం (1947)

        ద్రోహి (1948)

        మన దేశం (1949)

        సంసారం (1950)

        షావుకారు (1950)


పురస్కారాలు


దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎల్వీ ప్రసాద్ స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.


మాతృభాష తెలుగులోనూ, తమిళ, హిందీ భాషల్లోనూ ఎల్వీ ప్రసాద్ చిత్రాలను రూపొందించినా, అన్నీ కలిపి గుప్పెడు లేవు... అయినా ఆ చిత్రాల్లోనే తనదైన బాణీ పలికించి తెలుగువారి మదిలో చెరగని ముద్రవేశారాయన. ఎల్వీ ప్రసాద్ చిత్రాలు ఈతరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆయన స్థాపించిన సినిమా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పరచుకుని ఉన్నాయి. ఆయన నెలకొల్పిన ‘ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్’ దేశంలోనే అత్యున్నత నేత్ర చికిత్సాలయంగా పేరొందింది. ఆయన వారసులు దేశంలోనే అతి పెద్ద ఐమాక్స్ థియేటర్‌ను భాగ్యనగరంలో నిలిపారు… అలా ప్రసాద్ పేరు తరతరాలు గుర్తుంచుకొనేలా ఆయన ఏర్పాటు చేసిన సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంది.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..