స్వరాల రాయుడు "రమేష్ నాయుడు" గారి జయంతి నేడు...
@శ్రీనివాస్@
అద్భుత సంగీతాన్ని తెలుగు సంగీత ప్రియులకు పంచిన సంగీత దర్శకులు స్వరాల రాయుడు "రమేష్ నాయుడు" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు..
పసుపులేటి రమేష్ నాయుడు (జూన్ 27, 1933 - సెప్టెంబర్ 3, 1987) 1970వ, 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.
రమేష్ నాయుడు 1933లో కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించాడు. యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణములో పనిచేశాడు. అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది. అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం కూడా కలిగింది. ఈయన 16 యేళ్ళ వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం బంద్వల్ పహీజా అనే మరాఠీ చిత్రం.
ఈయన తెలుగు చిత్రరంగానికి సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం తరువాత మనోరమ (ఈ చిత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రెండు పాటలు పాడించారు) లాంటి ఒకటి రెండు తెలుగు చిత్రాలలో పనిచేసి 60వ దశకము ప్రారంభము కళ్ళా తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కలకత్తాకు మారి అనేక బెంగాళీ చిత్రాలకు పనిచేసి అక్కడే ఒక బెంగాళీ యువతిని పెళ్ళిచేసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు అనేక బెంగాళీ, నేపాలీ, ఒరియా చిత్రాలకు సంగీతము అందించాడు.
తెలుగులో రమేష్ నాయుని పునఃప్రవేశం 1972లో విడుదలైన శోభన్ బాబు చిత్రం అమ్మమాటతో జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగు చిత్రరంగంలో కొనసాగాడు. 1970, 80లలో ఈయన ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తెలుగు చిత్ర రంగానికి కొన్ని అత్యుత్తమ మధురగీతాలను అందించిన దర్శకులలో దాసరి నారాయణరావు, విజయ నిర్మల, జంధ్యాల ప్రధానమైన వారు.
రమేష్ నాయుడు గీతాలను తీసుకొని వాటికి మధురమైన బాణీలు కట్టేవాడు. ఇలాంటి శైలిలో పనిచేసే అతికొద్ది సంగీత దర్శకులలో కె.వి.మహదేవన్తో పాటు ఈయనా ఒకడు. వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు చిత్ర సంగీతదర్శకులు, దర్శకులతో తన అనుబంధము గురించి రచించిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో కె.వి.మహదేవన్, ఎన్టీ రామారావు, ఆత్రేయ, బాలు, ఇళయరాజా వంటి వారికి ఒక్కొక్క అధ్యాయము కేటాయించగా రమేష్ నాయుడు ఒక్కనికే రెండు అధ్యాయములు కేటాయించాడు.
రమేష్ నాయుడు హిందీ చిత్రరంగానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ను పరిచయం చేశాడు. మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ రమేష్ నాయుని సంగీత బృందంలో శాశ్వత సభ్యుడు. ఈయన చివరి చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి.
దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల, విజయ నిర్మల తాము నిర్మించిన అధిక శాతం చిత్రాలకు రమేష్ నాయుడునే సంగీత దర్శకునిగా నియమించుకున్నారు. కవులు రాసిన పాటలకు బాణీలు కట్టీవాడే కానీ ముందుగా బాణీ ఇచ్చి పాటలు రాయించేవారు కాదు రమేష్ నాయుడు. అలా తెలుగులో కె.వి. మహదేవన్ తరవాత రమేష్ నాయుడు పేరే చెపాల్సి వుంటుంది. గాయకుడిగా స్థిరపడాలని బొంబాయి వెళ్లిన రమేష్ నాయుడు అలా సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. అయితే తనలోని గాయకుడికి పని చెబుతూ ‘ఓ రామసక్కని బంగారు బొమ్మా’, పాటను, ‘తల్లి గోదారికి ఆటు పోటుంటే తప్పుతుందా మనిషికి తలరాత’ అనే నేపథ్య గీతాలను పాడి ప్రేక్షకులను అలరించారు. ఒక అద్భుత సంగీత దర్శకుడిగా వెలిగిన రమేష్ నాయుడు సెప్టెంబర్ 1, 1987న విశ్వనాథ్ చిత్రం ‘స్వయంకృషి’ విడుదలకు రెండ్రోజులముందే మరణించడం దురదృష్టమే.
రమేష్ నాయుడు తెలుగులో వంద చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు ఆ సినిమాలలో కొన్ని అపురూపమైన పాటలుకొన్ని...
* శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి (మీనా)
* దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా (దేవుఫు చేసిన మనుషులు)
* ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు ( రాధమ్మ పెళ్లి)
* దీపానికి కిరణం ఆభరణం (చదువు సంస్కారం)
* ఈ కాలం పది కాలాలు బ్రతకాలని (దేవుడే గెలిచాడు)
* శివరంజనీ నవరాగిణీ (తూర్పు పడమర)
* చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు (చిల్లరకొట్టు చిట్టెమ్మ)
* జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని)
* గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా (కల్యాణి)
* ప్రణయ కావ్యమున ప్రధమ పంక్తిలో (జయసుధ)
* అలివేణీ ఆణిముత్యమా (ముద్దమందారం)
* ముందు తెలిసేనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా (మేఘ సందేశం)
* కొలువైతివా రంగశాయి (ఆనంద భైరవి)
* తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు (శ్రీవారికి ప్రేమలేఖ)
* కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది (దేవదాసు)
* సిగ్గు పూబంతి సీతామాలక్ష్మి (స్వయంకృషి)

Comments
Post a Comment