టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఇకలేరు..
@శ్రీనివాస్@
టాలీవుడ్ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారు ఇకలేరు.. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఎనలేని సేవలు.. ఆయన స్మృతిలో కొన్ని విషయాలు..
కాసాని ఈశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో "ఈశ్వర్" నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసినవారు.పోస్టర్ డిజైనింగులో అందెవేసిన చేయి ఈశ్వర్‌ది. ఈయన రాసిన సినిమా పోస్టరు పుస్తకానికి 2012లో ఉత్తమ చలనచిత్ర పుస్తకం విభాగంలో నంది అవార్డు వచ్చింది.
పాలకొల్లులో లోహశిల్పుల కుటుంబంలో పుట్టిన ఈశ్వర్ చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. పాలిటెక్నిక్ చదువును అర్ధాంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. స్టూడియో కేతా అధిపతి కేతా సాంబమూర్తి, సరాగం స్టూడియో గంగాధర్ చేయూతనిచ్చి ఆదరించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్ద పెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో దేవుళ్ళు చిత్రం తర్వాత విశ్రాంత జీవితం గడుపుతున్నారు.ఆయన భార్య పేరు వరలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈశ్వర్ జీవితంలో చాలా నాటకీయత ఉంది. ఐశ్వర్యం, దారిద్ర్యం, విఫల ప్రేమ, బంధుమిత్రుల ద్రోహాలు, అవమానాలు, వీటన్నిటినీ అధిగమించి సఫలం కావడం, తనను అవమానించినవారిని సైతం ఆదరించటం యండమూరి, యద్దనపూడిల నవలలా ఉంటుంది ఆయన కథ.
బాపు-రమణల సాక్షి తెలుగులో ఆయన మొదటి చిత్రం. ఆ డిజైన్లు చూసిన విజయాధినేతలు రామ్ ఔర్ శ్యామ్ చిత్రం ఆయనకు అప్పగించారు. దాని తర్వాత వచ్చిన పాపకోసం చిత్రానికి ఆయన చేసిన డిజైన్లు ఆయనకు చాలా పేరు తెచ్చాయి. ఈశ్వర్ ప్రస్థానానికి ఇక అడ్డులేకుండా పోయింది. ఒక సంక్రాంతిరోజున తమిళంలో విడుదలైన ఆరుగురు పెద్ద హీరోల సినిమాలకూ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అంటే ఆయన ఆ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగాడో అర్థం అవుతుంది.
ఈశ్వర్, స్వతస్సిద్ధమైన ప్రతిభ ఉన్న కళాకారుడు. చిన్నతనంలోనే ఆయన నాటకాలు వ్రాసి ప్రదర్శించేవారు.రంగాలంకరణ చేసేవారు. పరిషత్ నాటకపోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు. ముందు చదువుకోసం, ఆ తర్వాత బతుకుతెరువుకోసం చిత్రకళను నమ్ముకున్నాక నాటకాలని వదిలేశారు కానీ, ఆ రంగంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేది అనిపిస్తుంది. గురు ముఖతా కాక చిత్రకళను స్వయంగానే నేర్చుకున్నారు. చిన్నతనంలో సినిమాపోస్టర్లకి నకళ్ళు గీసేవారట.
ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు చాలా వరకు(90శాతం) ఆయన తన తమ్ముడు బ్రహ్మం తో కలసి రూపొందించినవే..
ఈశ్వర్ గారు ఈ రోజు మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో కన్నుమూశారు.
ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది.

Comments
Post a Comment