నేడు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత "ఆదుర్తి సుబ్బారావు" గారి జయంతి..

 @శ్రీనివాస్@


నేడు ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత "ఆదుర్తి సుబ్బారావు" గారి జయంతి..



తెలుగు సినీరంగంలో దిగ్దర్శకులను వేళ్లపై లెక్కించవచ్చు. వారిలో అగ్రభాగాన నిలుస్తారు ఆదుర్తిగా విఖ్యాతుడైన ఆదుర్తి సుబ్బారావు.  ఆదుర్తి రాజమహేంద్రవరంలో 1912 డిసెంబర్‌ 16న సత్తన్నపంతులు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య రాజమహేంద్రవరంలో, ఉన్నత విద్య కాకినాడలో జరిగింది. ముంబైలోని సెయింట్‌ గ్జేవియర్స్‌ కళాశాలలో మూడేళ్లపాటు ఫొటోగ్రఫీకోర్సు నేర్చుకున్నారు. ముంబైలో బొంబే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాసెసింగ్, ప్రింటింగ్‌ డిపార్టుమెంట్లలో పని చేసి వాటిపై అవగాహన పెంచుకున్నారు. ఉదయశంకర్‌ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘కల్పన’కు సహాయదర్శకునిగా ఆదుర్తి సినీరంగంలో కాలుమోపారు. ఆ చిత్రానికి ఎడిటర్‌ కూడా ఆయనే. అలా తెలుగువాడైన ఆదుర్తి సినీ ప్రస్థానం హిందీ చిత్రరంగంతో ప్రారంభమైంది. తెలుగులో ‘బాలానందం’ సినిమాకు సహాయదర్శకునిగా పనిచేశారు. ‘అమరసందేశం’ ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా. అయితే అప్పట్లో అది పెద్ద విజయం సాధించలేదు. కానీ ఆదుర్తిలోని విషయజ్ఞత గుర్తించి అన్నపూర్ణ సంస్థ ఆయనకు అవకాశమిచ్చింది. ఆ సంస్థలో తొలి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘మూగమనసులు’. సఖినేటిపల్లి, కోటిపల్లి తదితర ప్రాంతాల్లో అవుట్‌డోర్‌లో తీసిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో అక్కినేని, సావిత్రి హీరోహీరోయిన్లుగా ఎన్నో చిత్రాలను ఆదుర్తి తెరకెక్కించారు. ఆ చిత్రానికి సహాయదర్శకుడిగా కళాతపస్వి కె. విశ్వనాథ్‌ పనిచేశారు. ఒకప్పుడు తెలుగు సినిమాకి పర్యాయ పదంగా ‘అఆ’లుగా (అక్కినేని, ఆదుర్తి) నిలిచారు. 


ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించాలనే ధ్యేయంతో అక్కినేని ఆదుర్తి కలసి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై సుడిగుండాలు, మరోప్రపంచం తీశారు. అయితే ఆ సినిమాలు ఆర్థికంగా నష్టం చూసినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆదుర్తి తీసిన ‘నమ్మినబంటు’ సినిమా విదేశాల్లో జరిగిన ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది.  రాష్ట్రపతి పతకాన్ని, ప్రశంసలను అందుకుంది. ఆయన సినిమాలు మాస్కో ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ వంటి వాటికి ఎంపికై అవార్డులు సాధించాయి. 


జైహింద్… నినాదం ఆదుర్తికి ఇష్టమట. అది సెంటిమెంట్ కూడా అంటారు. సినిమాల ముగింపులో `మంగళం, శుభం,సమాప్తం `లాంటి వాటిని  ఇష్టపడేవారు కాదు. `జైహింద్`అనే  వేయించేవారు. అందులో దేశభక్తి కూడి ఇమిడి ఉందని భావన కావచ్చు.


హీరో కృష్ణను తెలుగుతెరకు పరిచయం చేసింది ఆదుర్తే. సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆదుర్తి పది జాతీయ అవార్డులు, పలు నంది, ఫిలింఫేర్‌ అవార్డులను అందుకున్నారు.  ‘ఆదుర్తి సుబ్బారావు జీవితచరిత్ర’ ను హీరో కృష్ణ 18.11.2013న అవిష్కరించారు. ఆయన పేరుమీదుగా తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ప్రతీ ఏటా అవార్డులను అందజేస్తోంది. 


ఎన్నో గొప్ప సినిమాలు అందించిన ఆదుర్తికి `మహాభారతం, విశాల నేత్రాలు` చిత్రాలు తీయాలన్నది ఆయనకు ఎంతో ఉండేది.`మహాభారతం` స్క్రీన్ ప్లే  `పౌరాణిక బ్రహ్మ` కమలాకర కామేశ్వరరావు గారితో వ్రాయించి, యాక్షన్  పార్ట్ ను కేఎస్ఆర్ దాసుతో తీయించి, తాను  డ్రామాకు తాను దర్శకత్వం వహించాలన్నది ఆయన కోరిక.అది నెరవేరకుండానే 1 అక్టోబర్ 1975 అనారోగ్యంతో `తెర`మరుగయ్యారు దర్శక చక్రవర్తి ఆదుర్తి.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..