నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..
@🇸🇷🇪🇪🇳🇮🇻🇦🇸@
🌹చలనచిత్ర యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి నేడు... ఆ మహానటున్ని గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు మీకోసం..🌹
👉అతనిలా నటించగల విలక్షణ నటుడు ప్రపంచంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక సినిమాల్లో అతడు నటించని పాత్రలేదు. భీష్ముడు, సుయోధనుడు, రావణుడు, భీముడు, కర్ణుడు వంటి పాత్రల్ని హీరోచిత పాత్రలుగా మలిచి ఆ పాత్రల గొప్పతనాన్ని ప్రేక్షకులకు పంచిన ఆదర్శనటుడాయన. తేజస్సు మూర్తీభవించిన స్ఫురద్రూపి. ఆయన రూపమే సమ్మోహనాకారం... అది ఒక గ్రీకు శిల్పం. చిత్రసీమలో ఆయన ఒక సంచలనం. ‘‘పుణ్యపురుషులు యుగానికొకరే పుడతారు’’ అన్నట్లు మన చలనచిత్ర యుగానికి ఆయనే యుగపురుషుడు.... విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన అందరినీ సంభోంధించేది ‘‘బ్రదర్’’ అని కానీ అందరికీ ఆయనే పెద్దన్న. రాజకీయంలో బడుగు జీవులకు ఆపధ్బాంధవుడు. తిరుమల - తిరుపతి సందర్శించే భక్తజనకోటికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేసిన అన్నపూర్ణుడు.@శ్రీనివాస్@
👉పౌరాణికం.. జానపదం.. సాంఘికం... పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంలో నందమూరి తారక రామారావును మించిన వారు లేరు. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడయ్యారు. తెలుగు పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా నీరాజనాలందుకున్నారు. కేవలం కళారంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ అడుగిడి ప్రజలకు తనవంతు సేవచేసి తెలుగు ప్రజల మదిలో ఆరాధ్య దైవమయ్యారు నందమూరి తారక రామారావు. ఆయన 1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, నిమ్మకూరులో జన్మించారు. తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రావమ్మ. తెలుగువారికి ‘అన్నగారు’గా, ‘ఎన్టీఆర్’గా సుపరిచితులైన ఆయన, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో ఆంధ్రుల హృదయాల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినిమా జీవితంలో 186 సాంఘికాలు, 13 చారిత్రకాలు, 55 జానపద, 44 పౌరాణిక సినిమాలు చేశారు.@శ్రీనివాస్@
👉ఎన్టీఆర్‌కు తొలుత వాళ్లమ్మ కృష్ణ అని పేరు పెట్టాలనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుందని సూచించడంతో అదే పేరు పెట్టారు. తర్వాత అది కాస్తా తారక రామారావుగా మారింది. 1942లో 20ఏళ్ల వయసులో ఎన్టీఆర్ తన మేనమామ కూతురు బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. 1985లో బసవ రామ తారకం మరణించాక, ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు మొదటి నుంచి నాటక రంగంపై అభిరుచి ఎక్కువ. ఆ ఆసక్తే క్రమంగా బలపడి ఎన్టీఆర్‌ను సినిమాల వైపు తీసుకువచ్చేలా చేసింది. అందుకే సబ్−రిజిస్ట్రార్‌గా ప్రభుత్వ ఉద్యోగం లభించినా.. అందులో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు ఎన్టీఆర్. అక్కడ నుంచి క్రమంగా సినిమాల్లో నటించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాల్లోనే ఉండగానే ప్రముఖ దర్శకుడు ఎల్వీప్రసాద్ తీస్తున్న ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కథానాయకుడిగా ఎన్టీఆర్‌కు అవకాశం వచ్చింది. కానీ దాని నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఆ తర్వాత ‘మనదేశం’లో అవకాశం వచ్చింది. అలా ఆయన తొలిసారి కెమేరా ముందు నటించిన సినిమా ‘మనదేశం’ అయింది. దీని తర్వాత ఎల్వీప్రసాద్‌తో ‘షావుకారు’ చేశారు. అది మంచి పేరు తెచ్చింది. ఇక 1951లో కె.వి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పాతాళభైరవి’, 1952లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మల్లీశ్వరి’ ఎన్టీఆర్‌కు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1956లో వచ్చిన ‘మాయాబజార్’తో ఎన్టీఆర్ అగ్రకథానాయకుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించిందా చిత్రం. అక్కడి నుంచి ‘భూకైలాస్’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్య్మం’, ‘లవకుశ’ వంటి అద్భుత చిత్రాలతో తెలుగు పరిశ్రమలో దిగ్గజ నటుడిగా ఎదిగారు. ఈ క్రమంలో ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ.. ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’. ఆ తర్వాత 1977లో ‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తూ.. స్వయంగా దర్శకత్వం వహించారు. అది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్నందుకుంది. వీటితో పాటు ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సర్దార్ పాపారాయుడు’ తదితర సినిమాలు ఎన్టీఆర్‌కు మంచి పేరు తెచ్చాయి. ఎన్టీఆర్ చివరగా నటించిన చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. ఆ సినిమాలో నందమూరి నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.@శ్రీనివాస్@
🍁రాజకీయ ప్రస్థానం:🍁
👉తాను కొత్తపార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ 1982 మార్చి 29న తొలిసారి ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును ‘తెలుగుదేశం’గా నిర్ణయించారు. తన సొంత వాహనం ‘చైతన్య రథం’పై ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నంత కాలం ఒక శ్రామికుడిలా ఖాకీ దుస్తులు మాత్రమే ధరించి తన పర్యటనను కొనసాగించారు. అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలోని అవినీతిని ఎండగట్టేలా అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమస్య అని నినదిస్తూ ప్రచారం సాగించారు. అప్పటికే కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు.. ఎన్టీఆర్ నినాదాలకు ఆకర్షితులయ్యారు. ఎన్నికలు ముగిసాయి. 1983 జనవరిలో ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 199 సీట్లు సాధించి కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 9 నెలల వయసున్న తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలను చవిచూడాల్సి వచ్చింది. ఆయన 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.@శ్రీనివాస్@
💟💟💟💟💟💟💟💟💟💟
Comments
Post a Comment