నేడు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారి వర్ధంతి..

 @శ్రీనివాస్@


సహజ నటనతో వెండితెర మీద తనదైన ముద్ర వేసిన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గారి వర్ధంతి నేడు...



రమణమూర్తి 1933 మే 20న శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం లుకులాం అగ్రహారంలో జన్మించారు. మొత్తం ఆరుగురు సంతానంలో ఈయన నాలుగోవారు. శంకరాభరణం చిత్రంలో శంకరశాస్త్రిగా చిరకీర్తి సంపాదించుకున్న జె.వి.సోమయాజులు ఈయనకు స్వయానా అన్నయ్య. రమణమూర్తికి చిన్ననాటి నుంచే నాటకాలమీద ఆసక్తి ఏర్పడింది. విజయనగరంలోని మహారాజా కళాశాలలో బీఎస్సీ చదువుతున్న రోజుల నుంచి నాటకాల్లో నటించడం, దర్శకత్వం వహించడం ప్రారంభించారు. తర్వాత తన అన్న సోమయాజులు, మరికొందరితో కలిసి ‘నటరాజ కళాసమితి’ స్థాపించారు. ‘ఎన్జీవో, కాళరాత్రి, దొంగాటకం, ఎవరు దొంగ?, కప్పలు, కీర్తిశేషులు, కాటమరాజు కథ’ లాంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. కన్యాశుల్కం నాటకం నిడివి ఎక్కువగా ఉండటంతో అప్పట్లో ఒక అంకాన్నే పదర్శిస్తూ ఉండేవారు. రమణమూర్తి భావం చెడకుండా ఎనిమిది గంటల ఆ నాటకాన్ని గంట నిడివికి కుదించారు. తొలిసారి 1953 ఏప్రిల్‌లో విజయనగరంలో కన్యాశుల్కం నాటకం వేశారు. అప్పటి నుంచి 1995 సెప్టెంబరు వరకు 42 ఏళ్ల పాటు ‘నటరాజ కళాసమితి’ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని దేశమంతటా వెయ్యిసార్లకు పైగా ప్రదర్శించారు. గిరీశం పాత్రను రమణమూర్తి పోషిస్తే, రామప్ప పంతులుగా సోమయాజులు నటించేవారు. ఈ నాటకం ద్వారా గిరీశం అంటే రమణమూర్తే అన్నట్టుగా తెలుగునేల మీద ప్రసిద్ధికెక్కారు. దూరదర్శన్‌ కోసం కన్యాశుల్కం 19 అంకాలను ఆయన రూపొందించారు. చివర్లో గిరీశం పాత్ర పరివర్తన చెందినట్లు ఇందులో చూపించడం విశేషం. 


హైదరాబాదులో ‘కాళరాత్రి’ నాటక ప్రదర్శనకు రచయిత డి.వి.నరసరాజు, దర్శకులు తానినేని ప్రకాశరావు హాజరయ్యారు. రమణమూర్తి రూపం, నటనను చూసి వాళ్లు ఆయన పేరును ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌కు సూచించారు. ప్రసాద్‌ మేనల్లుడు కె.బి.తిలక్‌ 1957లో ‘ఎం.ఎల్‌.ఎ’ చిత్రం ద్వారా రమణమూర్తిని వెండితెరకు పరిచయం చేశారు. అందులో ఆయన సహాయ పాత్ర పోషించారు. తర్వాత ‘బావామరదళ్లు, పెళ్లిమీద పెళ్లి’ లాంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ‘మంచి మనసుకు మంచి రోజులు, శభాష్‌ రాముడు’ చిత్రాల్లో నందమూరి తారక రామారావుతో, ‘మాంగల్యబలం, అమాయకురాలు’ చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు. నటుడిగా రాణిస్తున్న సమయంలో ఓ దుర్ఘటనలో కాలు దెబ్బతిని అయిదేళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అనంతరం ‘సిరిసిరిమువ్వ, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, గోరింటాకు, గుప్పెడు మనసు, సప్తపది, సిరివెన్నెల, శుభలేఖ, వంశగౌరవం’ లాంటి సినిమాల్లో సహాయ నటుడిగా ఆకట్టుకున్నారు. అన్ని భాషల్లో కలిపి మొత్తం 150 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయన చివరి సినిమా 2013లో వచ్చిన ‘తుమ్మెద’. కాలక్రమంలో టీవీ ధారావాహికల్లోనూ రమణమూర్తి కనిపించారు. తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు నాటక ప్రదర్శనకు సంబంధించి శిక్షణ కూడా ఇచ్చారు. ఆయన రంగస్థల సేవకుగాను 2016 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ నాటక రంగ అభివృద్ధి సంస్థ తరపున జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. రమణమూర్తికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన ఆయన జూన్‌ 22న హైదరాబాదులో కన్నుమూశారు.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..