నేడు "సాక్షి రంగారావు" గారి వర్ధంతి..
@శ్రీనివాస్@
కామెడీ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ "సాక్షి రంగారావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు
సాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్ , వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి.
జంధ్యాల తీసిన ‘రెండు రెళ్లు ఆరు’ సినిమాలో సాక్షి రంగారావు క్యారెక్టర్‌కు టిపికల్ మేనరిజం పెట్టారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మాట్లాడాలని జంధ్యాల చెప్పగానే.. ఓకే అనేసి సాక్షి రంగారావుగారు మాట్లాడిన పద్దతి విని తీరాల్సిందే. కామెడీ చేయడంలో సాక్షి రంగారావు టైమింగే టైమింగు.
కె.విశ్వనాథ్ డైరెక్షన్లో వెంకటేశ్, భానుప్రియ జంటగా తెరకెక్కిన ‘స్వర్ణ కమలం’ సినిమాలో భక్తి ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న దేవుళ్ల పటాలన్నీ మసిలో కప్పడిపోయేలా హారతులిచ్చే భార్యతో వేగే భర్తగా కనిపిస్తారు సాక్షి రంగారావు. భార్య శ్రీలక్ష్మితో ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. క్యారెక్టర్‌ను అర్ధం చేసుకుని డైలాగును స్వానుభవానికి తెచ్చుకుని నటిస్తే కానీ ఆ సిద్ధి రాదు. పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు... మనం కనిపించినంత సేపూ ఆడియన్స్ అటెన్షన్ మనమీదే ఉండాలి అనేది సాక్షి రంగారావు లెక్క.
‘సాగర సంగమం’లో కమల్ హాసన్ తల్లి సాక్షి రంగారావు క్యాటరింగు ట్రూప్‌లో పనిచేస్తూ ఉంటుంది. తల్లిని సాగనంపడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చిన కమల్‌ను ఆయన గదమాయించే సీన్ చూసి తీరాల్సిందే. నువ్వెక్కూ ... నువ్వు దిక్కూ.. అంటూ విచిత్రమైన తనకు మాత్రమే సాధ్యమైన మాడ్యులేషన్లో చెలరేగిపోతాడు. స్క్రీన్ మీద ఏ రసాన్నైనా అద్భుతంగా పలికించే నటుడు సాక్షి రంగారావు. ఆయన విలనిజాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కామెడీకి జనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. సెంటిమెంట్ సీన్లలో జనం కళ్లు చెమ్మగిల్లేవి.
సాక్షి రంగారావులోని ఈ అన్ని డైమన్షన్స్‌ని వాడుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్ ఒక్కరే. శంకరాభరణంలో శంకర శాస్త్రి ట్రూప్‌లో మృదంగం వాయించే పాత్ర సాక్షి రంగారావుది. కళకు కళతప్పిన సందర్భంలో శంకరశాస్త్రిని కలిసిన గోపాలం పాత్రలో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. బాపుగారి ‘బంగారు పిచ్చుక’ సినిమాలో అతిక్రూరంగా విలనీ చేశారు సాక్షి రంగారావు. శాంతకుమారి సెక్రటరీ పాత్రలో విశ్వరూపం చూపించారు. చాలా వినయంగా కనిపిస్తూనే వెనకాల గోతులు తవ్వే పాత్ర అది. క్లైమాక్స్‌లో విలన్‌గా ఓపెన్ అయ్యే సీన్‌లో సాక్షి రంగారావు నటన నాటి డైరక్టర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా పరాజయం పాలైనా సాక్షి రంగారావుకు మాత్రం వరుస ఆఫర్లు క్యూకట్టాయి.
కె.విశ్వనాథ్ అయితే సాక్షి రంగారావు లేకుండా సినిమా తీయలేదు. ఆయన డైరక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు ఏదొక పాత్రలో కనిపించేవారు. స్వాతి కిరణం వరకు ఈ అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ‘సిరివెన్నెల’ చిత్రంలో విశ్వనాథ్ ఓ ప్రయోగం చేశారు. మిశ్రోకు తాత పాత్ర ఇచ్చి ఆయన మనవడి పాత్రలో సాక్షి రంగారావును ప్రవేశపెట్టారు. తాత గారూ...అనే పదాన్ని విచిత్రంగా పలుకుతూ ఆయన డైలాగు చెప్పే తీరుకు ఆడియన్స్ అవాక్కయ్యారు. ముప్పై రోజుల్లో ఏదైనా నేర్చుకోవచ్చు అంటూ మార్కెట్లో పోటెత్తిన పుస్తకాల మీద సెటైర్ వేస్తూ ‘సూత్రధారులు’ సినిమాలో శ్రీలక్ష్మి పాత్రను తీర్చిదిద్దారు విశ్వనాథ్. 30 రోజుల్లో కరాటే ... ముప్పై రోజుల్లో కర్ణాటక సంగీతం.. ఇలాంటి పుస్తకాలు తెచ్చి ప్రయోగాలు చేసే భార్యకు భర్తగా సాక్షి రంగారావు జీవించారు.
వంశీ సినిమాల్లోనూ సాక్షి రంగారావుకు తప్పనిసరిగా పాత్ర ఉండేది. ‘ఏప్రిల్ 1 విడుదల’ లాంటి సినిమాల్లో కమెడియన్‌గా రెచ్చిపోయిన సాక్షి రంగారావుతో.. ‘మంచుపల్లకి’లో సెంటిమెంట్ పాత్ర చేయించారు. ‘సితార’లో ఆయన చేసిన పాత్ర కలకాలం గుర్తుండిపోతుంది. జమీందారు దయ కోసం ఆయన ముందు కళా ప్రదర్శన చేయాలన్న తపనతో వచ్చిన భాగవతుల ట్రూపు నాయకుడిగా సాక్షి రంగారావు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా జీవితాంతం కొనసాగాలని, ప్రాణం పోయే వరకు నటిస్తూనే ఉండాలని చాలామంది నటులు కోరుకుంటారు. సాక్షిరంగారావు విషయంలో అది నిజమైంది.
2005, మే 5 వతేదీన గురజాడ వారి నాటకం కన్యాశుల్కం (నాటకం) లో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్ చేస్తుండగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించిన తరువాత తుదిశ్వాస విడిచారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతూ ఉండేవారు.
ఆయన నటించిన చివరి సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకం.
చక్కెర వ్యాధి ముదిరి మూత్రపిండాలు పాడయిపోవడంతో చెన్నై వైద్యశాలలో జూన్ 27, 2005 రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.

Comments
Post a Comment