నటి, దర్శకురాలు "విజయనిర్మల" గారి వర్ధంతి..

 @శ్రీనివాస్@

నటి, దర్శకురాలు "విజయనిర్మల" గారి వర్ధంతి.. ఆమె గురించి కొన్ని విషయాలు..



విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె సినీ నటుడు నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.

విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు.ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.

పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిసుబుక్‌లో ఎక్కారు.నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.

ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు.

విజయనిర్మల మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష,  మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు.

తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు.

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదారాబాదు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, జూన్ 27 గురువారం ఉదయం మరణించారు.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..