వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" గారి వర్ధంతి నేడు...
@శ్రీనివాస్@
వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" గారి వర్ధంతి నేడు...
1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు.
ఆ రోజుల్ని బట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరపు పెద్దలు.
ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావు గారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవి గారు.
రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమె కూడా ఆ చర్చల్లో పాల్గొనేవారుట.
మధ్యతరగతి మహిళల జీవితాల్లోని ఆటుపోట్లను అక్షరీకరించిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆవిడ..
ఛాయాదేవి డెభ్భైకుపైగా కథలు, యాత్రారచనలు, సాహిత్య వ్యాసాలు, నవలలు రచించారు. కుటుంబంలో ఆడపిల్లలు ఎదుర్కొనే వివక్షను ఎత్తిచూపుతూ ఆమె రాసిన ‘బోన్సాయ్ బ్రతుకు’ కథను 2000వ సంవ్సతరంలో పదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా బోధించడం విశేషం. ‘తనమార్గం’ కథా సంపుటికి 2005లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తన స్వీయ అనుభవాలతో రచించిన ‘మృత్యుంజయ’ నవలకు గాను 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘ఉత్తమ రచయిత్రి’ పురస్కారం అందుకున్నారు. ఛాయాదేవి కథలు ఆంగ్లం, స్పాని్‌షతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. జిడ్డు కృష్ణమూర్తి అభిమానిగా.. ఆయన ‘కామెంటరీస్ ఆన్ లివింగ్’ పుస్తకాన్ని ‘మన జీవితాలు - వ్యాఖ్యానాలు’ పేరుతో ఛాయాదేవి తెలుగులోకి అనువదించారు. 1998-2002 మధ్యకాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యురాలిగా సేవలందించారు.
కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో ఆమె కొన్నేళ్లుగా ఉన్నారు.తనువు చాలించాక తన దేహం వైద్యవిద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడాలని పరితపించారామె. తన కళ్లు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలని తలచారు. ఈ మేరకు పదేళ్ల క్రితమే వీలునామా రాశారు. ఆమె కోరిక మేరకు.. ఆమె ఆత్మీయులు, సాహితీ మిత్రులు ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి ఆమె కళ్లను దానమిచ్చారు. భౌతిక కాయాన్ని ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ప్రభుత్వ వైద్యకళాశాలకు అప్పగించారు. ఆమె వ్యక్తిగత గ్రంథాలయంలోని పుస్తకాలను సీఆర్ ఫౌండేషన్ పరిశోధన కేంద్రానికి ఇచ్చారు.
తన 86 వ ఏట 28-6-2019 వతేదీన భౌతికంగా మనలకు దూరమైనా మన మనసుల్లోనూ సాహితీలోకంలోనూ అబ్బూరి ఛాయాదేవిగారు చిరస్థాయిగా నిలిచే ఉంటారన్నది వాస్తవం.

Comments
Post a Comment