సినీ నటుడు, దర్శకుడు, రచయిత "రంగనాథ్" గారి జయంతి నేడు...
@శ్రీనివాస్@
సినీ నటుడు, దర్శకుడు, రచయిత "రంగనాథ్" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు..
తిరుమల సుందర శ్రీరంగనాథ్ (జూలై 17, 1949 - డిసెంబర్ 19, 2015) (T.S.S.Ranganath) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు.ఈయన 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించాడు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. వీరు రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. వీరు డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో మరణించాడు.
రంగనాథ్ కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్న వారు కాకపోవటంతో రంగనాధ్ బాల్యం అంతా సాధారణంగానే గడిచింది. తాతగారి ఇంట్లో ఆయన పెరిగారు. రంగనాధ్ బాల్యంలోని తాతగారింట వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగానాధ్ కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే నిర్ణయానికొచ్చారు. అదే ఉద్దేశంతో చిన్నతనంలో నాటకరంగం వైపు వచ్చారు. అనేక నాటకాలలో వివిధ పాత్రలను వేసారు. అక్కడినుంచి సినీరంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది. వారి తల్లి ప్రోత్సాహంతో ఈ కోరిక మరింత బలపడింది.
సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున తారాపథం తివాచీ పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని చెప్పవచ్చు. చదువుకొనే రోజుల నుంచీ పలు అంశాలపై కవితలు రాసి, సన్నిహితులను అలరించారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలన్నా, వాటిలో నటించడమన్నా రంగనాథ్ కు ఎంతో ఆసక్తి. బి.ఏ. చదివిన రంగనాథ్ కొంతకాలం రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేశారు. మిత్రుల ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని చిత్రాలలో కనీకనిపించని పాత్రలు కూడా పోషించారు. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్ కు హీరోగా అవకాశం లభించింది.
రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. పేరుగా తగ్గట్టే సుందర రూపుడు. ఆరడగుల ఎత్తు. చూడగానే ఆకట్టుకొనే రూపం. ‘చందన’ సినిమాతో హీరో అయిన రంగనాథ్ ఆ తరువాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు. సింగీతం శ్రీనివాసరావు, రంగనాథ్ ను ప్రోత్సహించారని చెప్పాలి. తాను తెరకెక్కించిన “జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, అందమె ఆనందం, పంతులమ్మ” వంటి చిత్రాలలో రంగనాథ్ కు హీరోగా అవకాశాలు కల్పించారు. ఈ చిత్రాలు రంగనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే “చదువు-సంస్కారం, సెక్రటరీ, లాయర్ విశ్వనాథ్, రామయ్య తండ్రి, రామచిలక, దేవతలారా దీవించండి, ఇంటింటి రామాయణం, తాయారమ్మ-బంగారయ్య, లవ్ ఇన్ సింగపూర్” వంటి చిత్రాలలో కథానాయకుడుగా, ఉప నాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్. హీరోగా అవకాశాలు తగ్గు ముఖం పట్టగానే కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయ్యారాయన. కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనేక చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ గా హుందాగా నటించి అలరించారు. వైవిధ్యం కోసం ‘గువ్వలజంట, రక్తాభిషేకం” వంటి చిత్రాలలో విలన్ గానూ కనిపించారు. అయితే సదరు చిత్రాలేవీ ఆయనకు అంతగా కలసి రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లో రంగనాథ్ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించటం ఆయనను మహిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది. కానీ సినీ రంగంలో వచ్చిన మార్పులు కారణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వచ్చాయి. దీంతో మరో మార్గం లేక విలన్ గా మారారు. 'గువ్వల జంట' సినిమాతో తొలి సారిగా ప్రతినాయక పాత్రలో అలరించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన నటనతో ఆకట్టుకున్నారు రంగనాధ్. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్ తో పాటు, రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన శాంతినివాసం సీరియల్ లోనూ కీలక పాత్రలో నటించారు.
కేరెక్టర్ యాక్టర్ గా రంగనాథ్ కు మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనూ ఆయన పారితోషికం విషయంలో ఏ నాడూ ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు. నిర్మాత ఎంత ఇస్తే అంతే పుచ్చుకొనేవారు. మృదుభాషి అయిన రంగనాథ్ అంటే చిత్రసీమలో అందరికీ అభిమానమే. ఆయన భార్య ప్రమాదవశాన పక్షవాతానికి గురయినప్పుడు రంగనాథ్ ఆమెకు ఎంతగానో సపర్యలు చేశారు. రంగనాథ్ కు ఇద్దరు కూతుళ్ళు, ఓ అబ్బాయి. భార్య మరణం రంగనాథ్ ను కుంగదీసింది. ఏదో నటనలో పడి అలా అలా నెట్టుకు వచ్చారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్, ఆత్మస్థైర్యం కోల్పోయారు. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సున్నిత మనస్కుడైన రంగనాథ్ ను ఏదో బాధ అలా చేయడానికి దారి తీసి ఉంటుందని అభిమానులు, సన్నిహితులు భావించారు. ఏది ఏమైనా ఆయన హుందా నటనను జనం మరచిపోలేరు.
మరణించే ముందు గుడ్ బై సర్ అంటూ తన మిత్రుడు బైస దేవదాస్ గారికి సందేశం పంపారు. తనకు వంటచేసే పనిమనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రబ్యాంకు బాండ్లు అందవలసినదిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియజేసారు.

Comments
Post a Comment