నేడు "సౌందర్య" గారి జయంతి..

 @శ్రీనివాస్@


తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియాలో, అలాగే బాలీవుడ్ లో సైతం తన పేరును చిరస్థాయిగా నిలిచి ఉండేలా చేసుకున్న "సౌందర్య" గారి జయంతి నేడు... ఆమె గురించి కొన్ని విషయాలు..



సౌందర్య... తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. ఆమె పేరు తలుచుకోగానే చక్కటి చీరకట్టులో ఓ అందమైన రూపం కళ్లముందు కదులుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది  హీరోయిన్లు వచ్చినా సౌందర్య చాలా ప్రత్యేకం. చనిపోయే వరకు ఎక్స్‌పోజింగ్‌, గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కూడా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. ఆమె ఈ లోకాన్ని విడిచి 17 ఏళ్లవుతున్నాఇప్పటికీ ఆమెను మరిచిపోలేని అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతలా తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆమె. ఏ పాత్రలో అయినా ఓదిగిపోయే సౌందర్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు.


సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది.


సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.


చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే సౌందర్య మరణం ఆమె అభిమానులను ఎంతగానో కలిచివేసింది. కాగా కెరీర్ చివర్లో సంచలన సినిమాలు చేసిన సౌందర్య జీవితంలో ఎన్నో చెప్పుకొదగ్గ ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆమె బతికున్న రోజుల్లో తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడూ మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వారు లేకపోయిన ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.


పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొంది. అవి: అమ్మోరు (1994), అంత:పురం(1998), రాజా (1999), ద్వీప(2002) (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర (2004). కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి(తెలుగులో మహిళ), ద్వీప(ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర చిత్రాలకై అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు "సౌందర్య".సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. ఆమెను జూనియర్ సావిత్రి అంటారు.సౌందర్యకు నవరసనటన మయూరి అనే బిరుదు గలదు.


సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం"ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..