నేడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారి పుట్టినరోజు..

 @శ్రీనివాస్@

ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి గర్వించదగ్గ చిత్రాల్లో నటించిన నవ్వుల రాజు,నటకిరీటి "రాజేంద్రప్రసాద్" గారి పుట్టినరోజు నేడు... ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆయన గురించి కొన్ని విషయాలు..



తెలుగు తెరపై సందడి చేసిన హాస్యనటులు ఎందరో ఉన్నారు. కస్తూరి శివరావు .. రేలంగి .. రమణారెడ్డి .. రాజబాబు .. పద్మనాభం .. అల్లు రామలింగయ్య హాస్యనటులుగా తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే అప్పట్లో హాస్యమనేది కథలో ఒక భాగంగా మాత్రమే ఉండేది. ఆ తరువాత హాస్యరసం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హాస్యమే ప్రధానంగా సినిమాలు రావడం మొదలైంది. అలా హాస్య ప్రధానమైన కథల ద్వారా కథానాయకుడిగా తెలుగు తెరపై తమ జోరు చూపించినవారిలో రాజేంద్రప్రసాద్ ముందువరుసలో కనిపిస్తారు.

రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ.అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.

ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. క్యారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.

ఏప్రిల్ 1 విడుదల .. లేడీస్ టైలర్ .. అప్పుల అప్పారావు .. మాయలోడు .. ఆ ఒక్కటీ అడక్కు .. కొబ్బరి బొండాం .. పెళ్లి పుస్తకం .. రాజేంద్రుడు - గజేంద్రుడు సినిమాలు రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ గ్రాఫ్ ను రాకెట్ వేగంతో పెంచేశాయి. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు తెచ్చేవిగా రాజేంద్రప్రసాద్ సినిమాలు మారిపోయాయి. రాజేంద్రప్రసాద్ సినిమాలంటే 100 పర్సెంట్ హాయిగా నవ్వుకోవచ్చనే నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడిపోయింది. వంశీ .. ఈవీవీ ... రేలంగి నరసింహారావు .. ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు ఆయన క్రేజ్ ను మరింతగా పెంచుతూ వెళ్లారు.

తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

 ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. తెలుగు సినిమాల్లో కామెడీకి ‘లేడీస్ టైలర్’ ఒక మార్క్ అయితే, ఏ కమర్షియల్ సినిమాకి కామెడీ సినిమా తీసిపోదు అని నిరూపించింది ‘అహ నా పెళ్లంట. ఈ సినిమా వరుసగా ఎన్నో రికార్డులను సృష్టించింది. తెలుగు కామెడీ సినిమా స్థాయిని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటి. జంధ్యాలగారు .. నేను కలిసి చేసిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా రామానాయుడు గారు నాకు ఒక కారును కానుకగా ఇచ్చారు. ఆ తరువాత దర్శకుడు జంధ్యాల గారికి కూడా కొత్త కారును కానుకగా ఇచ్చారు.

రాజేంద్రప్రసాద్ కి నవ్వించడమే కాదు .. బరువైన పాత్రలతో కన్నీళ్లు పెట్టించడం కూడా తెలుసు. ఎర్ర మందారం .. ఆ నలుగురు .. మీ శ్రేయోభిలాషి .. ఓనమాలు .. సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఫుల్ బిజీ. అయినా ఇప్పటికీ కూడా ఆయన ప్రధానమైన పాత్రగా తోలుబొమ్మలాట .. గాలి సంపత్ వంటి సినిమాలు అడపా దడపా వస్తున్నాయంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా అభిమానిస్తున్నారో .. ఆయన నటనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మన కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..