నేడు ప్రముఖ దర్శకులు "బాలచందర్" గారి జయంతి..
@శ్రీనివాస్@
ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర వంటి గొప్ప చిత్రాల సృష్టికర్త "కైలాసం బాలచందర్" గారి జయంతి నేడు... ఆ ప్రముఖ దర్శకులు గురించి కొన్ని విషయాలు..
1930, జులై 9న తమిళనాడులోని తంజావూర్లో బాలచందర్ జన్మించారు. 1964లో రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర రంగంలో దాదాపు 101 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే పలు టీవీ సీరియళ్లకు రచన, దర్శకత్వం వహించారు. తెలుగులో భలే కోడళ్లు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఆకలిరాజ్యం, అంతులేని కథ, రుద్రవీణ, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా, జీవితరంగం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, చిలకమ్మ చెప్పింది తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముటీ, ప్రకాశ్ రాజ్లను చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో హిందీలో తొలి సారిగా పాటలు పాడించిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. అబద్ధం, రెట్టసుళి, ఉత్తమ విలన్ చిత్రాలలో బాలచందర్ నటించారు.
ఆయన భార్య పేరు రాజం. వీరికి ముగ్గురు పిల్లలు. కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.
బాలచందర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలో 12వ ఏటే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. చెన్నై మహానగరంలోకి అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు.
అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులను పరిచయం చేసిన ఘనత కె.బాలచందర్‌దే. ఈయన తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో 100 చిత్రాలకుపైగా చేసి భారతీయ సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందారు.
ఎంజీఆర్ హీరోగా చేసిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా సినీరంగంలో ప్రవేశించారు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన ప్రతిష్ఠాత్మకమైన ‘అక్కినేని అంతర్జాతీయ పురస్కారం’ అందుకున్నారు. ఇది కథ కాదు, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్రవీణ.. ఇలాంటి అద్భుత చిత్రరాజాలన్నీ బాలచందర్ దర్శకత్వ ప్రతిభకు మచ్చుతునకలు.
చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రవీణ గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయన ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమల్ హాసన్, సరిత నటించిన మరో చరిత్ర అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్న విషాదాంత ప్రేమకథ.
పురస్కారాలు:
1973 లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు
1987లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బాలచందర్ను సత్కరించింది.
2010లో దాదాసాహెబ్ పాల్కె అవార్డును అందుకున్నారు.
9 జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
1982లో ఏక్ దూజే కేలియే చిత్రానికి కథ స్క్రీన్ ప్లే ఉత్తమ అవార్డు అందుకున్నారు.
2010లో ఏఎన్ఆర్ అవార్డులను అందుకున్నారు.
కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 84 సంవత్సరాల వయసులో డిసెంబర్ 23,2014 న చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Comments
Post a Comment