నేడు "హరికథా పితామహ" శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి..
@శ్రీనివాస్@
హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి నేడు... ఆ సాహితీవేత్త గురించి కొన్ని విషయాలు..
తెలుగువారి కళాసాహిత్య సంగీత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన అపురూప కళారూపం హరికథ. కేవలం ఒక్క కళాకారుడు సంగీత, సాహిత్య, నృత్య, అభినయ కళాభినివేశంతో మృదంగం, వయోలిన్ వాద్య సహకారంతో శ్రోతలను ఆధ్యాత్మిక, కళాసాగరంలో ఓలలాడించే ఈ కళారూప సృష్టికర్త శ్రీనారాయణదాసు.
ఒకనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో 1864 ఆగస్టు 31న ఆదిభట్ల జన్మించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపాన బలిజపేట మండలంలోని అజ్జాడ ఆయన జన్మ స్థలం. తను జన్మించిన అజ్జాడ గ్రామనామాన్ని తన పేరులో ఇముడ్చుకుని ఆ గడ్డను ధన్యం చేసిన మహనీయుడు. ఆదిభట్ల వేంకటచయనులు, లక్ష్మీనరసమాంబలు తల్లితండ్రులు.
వంశపారంపర్యంగా అబ్బిన సంస్కృతీ సంప్రదాయాల వలన చిన్ననాటినుంచి అరుదైన సంగీత జ్ఞానమబ్బింది. భక్తి భాగవత కీర్తనలతోనే బాల్యం ప్రారంభమైంది. ఆ సంగీత సాహిత్య జ్ఞానంతోనే కేవలం 19వ ఏటనే తొలి హరికథా గానం చేసిన సంగీతజ్ఞుడు.
తల్లితండ్రులు చేసిన నామకరణం సూర్యనారాయణ అయినా హరినామ సంకీర్తనా గానంతో చిన్న వయసులోనే లబ్ద ప్రతిష్టుడైన వారిని నారాయణదాసు భక్తి సంగీత ప్రియులు నారాయణదాసుగా కొనియాడారు. దాంతో నారాయణ దాసు గానే సంగీత కళాప్రపంచంలో ప్రసిద్ధుడైనారు.
అంతకు పూర్వం దక్షిణాదిలోనే శుద్ధ సంగీత నాట్యకళాప్రియులుగా ప్రసిద్ధమైన యక్షగానం, జక్కుల కథలను జనసామాన్యానికి కూడా చేరువయ్యేలా రూపుదిద్ది ‘హరికథ’గా నామకరణం చేసిన సంగీత రూపశిల్పి. ప్రయాణ, సమాచార సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలలోనే కాక ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి తన కళా ప్రతిభను చాటారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటివారు దాసుగారి ప్రతిభకు ముగ్ధులై ప్రశంసించారు.
ఆనాడు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో తన కళా పోషణతో ఆంధ్ర భోజునిగా కీర్తించబడిన విజయనగర సంస్థానాధీశుడు పూసపాటి ఆనందగజతిరాజు ఆదరాభిమానాలు పొందిన నారాయణ దాసు తనలోని ప్రతిభా పాటవాలు తీర్చిదిద్దుకున్నారు. మహాకవి గురజాడ, ఆదిభట్ల సమకాలీనులు కావడం తెలుగుభాషా కళామతల్లి తెలుగు జాతికిచ్చిన వరం. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగినా ఆనందగజపతిరాజు, గురజాడవంటివారి సాహచర్యం ప్రభావంతో తెలుగు, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం వంటి ఎనిమిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 1932లో ఉమర్‌ఖయామ్ రుబాయిలను తెలుగు, సంస్కృత భాషలలోకి అనువదించారు. మహాకవి కాళిదాసు, ఆంగ్లకవి షేక్స్‌పియర్‌ల సాహిత్యంలోని నవరసాల వర్ణనలను ఖండికలుగా రచించారు. ‘ప్రహ్లాద చరిత్ర’, ‘అంబరీష చరిత్ర’, ‘సావిత్రి’, ‘రుక్మిణీ కల్యాణం’, ‘గజేంద్ర మోక్షం’, ‘భీష్మచరిత్ర’ ‘జానకి శపథం’, ‘హరికథామృతం’, ‘తారకం’, ‘రామచంద్ర శతకం’, ‘కాశీ శతకం’, ‘యథార్థ రామాయణం’ వంటి రచనలు చేశారు. ‘బుక్ సంగ్రహం’ అనే కావ్యంలో ఋగ్వేదంలోని మూడువందల పైచిలుకు ఋక్కులకు సంగీతం సమకూర్చిన గొప్ప సంగీతసామ్రాట్టు ఆదిభట్ల నారాయణదాసు.
హరికథా పితామహునిగా, గొప్ప హరికథకునిగా అజరామరమైన కీర్తిప్రతిష్ఠలు గడించినా, దాంతో తృప్తి చెందలేదు. తనలోని పాండితీ ప్రకర్షను ప్రపంచానికి చాటి చెప్పేందుకు అవధానం చేసి సాహితీవేత్తల ప్రశంసలకు పాత్రుడైనారు. విశాఖలోని గోడే సంస్థానం జమిందారు అంకితం వెంకట జగ్గారావు ఆతిథ్యం స్వీకరించిన సందర్భంలో నారాయణ దాసుగారు గ్రీకుభాషలో అవధానం చేసి అందర్నీ అబ్బురపరిచారు. దక్షిణాదిలోనే ప్రఖ్యాత సంగీత కళాశాలగా పేరున్న విజయనగరం విజయరామగజపతి గాన పాఠశాల 1919లో స్థాపించినప్పుడు దానికి తొలి ప్రధానోపాధ్యాయునిగా సేవలందించారు. తెలుగునాట దాదాపు 130 సంవత్సరాలుగా అలరారుతున్న హరికథా కళారూపాన్ని రూపు దిద్దిన మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు 1945 జనవరి 2న పరమపదించారు.
నారాయణదాసు గారి దేహబంధువు (మనమరాలి భర్త) జాతీయాచార్యులు, సుప్రసిద్ధకవి స్వర్గీయ శిష్ట్లా వేంకట జోగారావు రచించిన ‘శ్రీఆదిభట్ల నారాయణదాసు సారస్వత సాదము’ పుస్తకం నారాయణదాసు గారిలోని మహావాగ్గేయకారుడిని, సంభాషణా చతురుని, సాహితీసంపన్నుని ఆవిష్కరిస్తుంది. ‘హరికథా పితామహుండు ఆదిభట్ల నారాయణదాసు... సాహితీ సంగీతములను సమతూచిన త్రాసు’ అని మహాకవి శ్రీశీ కీర్తించారు.

Comments
Post a Comment