నేడు ప్రముఖ సంగీత దర్శకులు "చక్రవర్తి" గారి జయంతి..
@శ్రీనివాస్@
నేడు ప్రముఖ సంగీత దర్శకులు "చక్రవర్తి" గారి జయంతి..
ఆకాశపు దారులెంట హడావుడిగా పరుగెత్తే సంగీతాన్ని భూమార్గం పట్టించిన సంగీత దర్శకుడు ఆయన. తెలుగు సినిమా పాటను.. ఉర్రూతలూగించి.. పరుగులెత్తించి.. శాసించి.. రికార్డింగ్ డాన్సు చేయించిన స్వర చక్రవర్తి. స్వర సామ్రాజ్యాన్ని నిజంగానే చక్రవర్తిలా ఏలారు చక్రవర్తి.. ఆయన జయంతి సందర్భంగా ఆయన సుస్వరాల సంగీతం ఒక సారి గుర్తు చేసుకుందాం. సప్తస్వరాలు ఏడే ఉంటాయి. కానీ వాటికి స్పష్టమైన గమకాలివ్వడం ఎండాకాలం ఎడారిలో పరుగెట్టినంత కష్టం.. అలాంటిది వాటితో సరసాలాడగలిగిన చాతుర్యం ఆయన సొంతం.. అలాగే సయ్యాటలాడగలిగేంతటి సాహసం ఆయనకు ఉందనడమూ అంతే నిజం.. అంతెందుకు వాటితో అహోరాత్రాలను గడిపిన అనుభవమూ ఓ తియ్యటి వాస్తవం.. ఒక్కమాటలో చెబితే, చక్రవర్తి రాగ రాజ్యాన్నేలిన రారాజు.. ఒకే ఏడాది 66 సినిమాలకు బాణీలు కట్టిన ఘనత చక్రవర్తిది. ప్రపంచంలో మరే సంగీత దర్శకుడు అందుకోలేని అరుదైన రికార్డది. ఒక పుష్కరకాలమంతా తెలుగునాట చక్రవర్తి రికార్డులే మారుమోగాయి. ఎన్టీఆర్ స్టెప్పులకు.. జయమాలిని చిందులకు ఆయన బాణీలే టానిక్ లా పని చేశాయి. చిరంజీవి వేగానికి.. కొత్త తరం దూకుడుకి ఆయన పాటలే ఊపు నిచ్చాయి. కృష్ణ సాహాసానికి, శోభన్ బాబు అందానికి, దర్శకేంద్రుడి కల్పన శక్తికి, దర్శకరత్న వైవిద్యానికి చక్రవర్తి బాణీలే బలాన్నిచ్చాయి. సంగీతాన్ని ఆయనో పట్టు పట్టాడా.. లేక సంగీతమే పట్టుపట్టి ఆయనకు రాగాభిషేకం చేసిందో తెలియదు.. కానీ, రాగం కడితే.. అది సుస్వరాగమై.. ప్రేక్షకుడిని మైమరిచిపోయేలా చేసి కట్టి పడేస్తుంది.. ఏడాదికి 35 సినిమాలు చేసిన స్వరరచన ఆయనది.. అంటేనే తెలియడం లేదూ. చక్రవర్తి తెలుగుతెరకు అద్దిన చక్కెరకేళీల తీయదనం ఏపాటిదో. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. పుట్టిన వూరు పొన్నెకల్లు. గుంటూరు జిల్లా. చదువు సరిగా వంటబట్టక గుంటూరులో వినోద్ ఆర్కెస్ర్టా స్థాపించారు. వందల కొద్దీ కచేరీలు చేశారు. చక్రవర్తి పాటలు విన్న గ్రామఫోన్ కంపెనీ మంగపతి చక్రవర్తిని ప్రయివేటు పాటలు పాడించడానికి మద్రాస్ రప్పించారు. చక్రవర్తి పాటలు విన్న సంగీత దర్శకసోదరులు రాజన్ నాగేంద్ర విఠలాచార్య సినిమాలో ఓ పాట పాడే అవకాశం కల్పించారు.పాటైతే పాడాడు కానీ వెంటనే అవకాశాలేమీ వెతుక్కుంటూ రాలేదు. ఇక లాభం లేదని పొట్ట కూటి కోసం పరిశ్రమకు చెందిన వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత సంగీత సామ్రట్టయ్యారు. చక్రవర్తిలో 'చక్ర' శబ్ధం ఉన్నమహిమో ఏమో గానీ, ఆయన పని తీరు కూడా అంతే.. చక్రం తిరిగినంత వేగంగా వుంటుంది. రాత్రికి రాత్రి రాగాలద్ది సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేస్తాడు. మూడ్ అంటూ రావాలే కానీ.. చక్రవర్తిని బాణీలు కట్టడం లెక్క కాదు. అయిదు నిమిషాల్లో వరసలు కట్టగలరు. గంటలో కంప్లీట్ చేయగలరు. ప్రేమాభిషేకం సినిమాలోని తారలు దిగివచ్చిన వేళ, వందనం అభివందనం, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, నా కళ్లు చెబుతున్నాయి పాటలను కేవలం ఒకే ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారు. ఇలాంటి ఫీట్లు చేయడం కేవలం చక్రవర్తికి మాత్రమే సాధ్యం. అవి మల్లెపువ్వు మ్యూజిక్ సిట్టింగ్ నాటి రోజులు. పాట రచన కోసం వేటూరి.. స్వర రచన కోసం చక్రవర్తి తెగ ప్రయత్నిస్తున్నారు. అప్పటికీ పన్నెండు రోజులు గడిచాయి. ఓ పదిహేను పాటలను ప్రయత్నించి చూశారు. సందర్భానికి తగినట్టు ఒక్కకంటే ఒక్కటి కూడా రావడం లేదు. వేటూరికి విసుగొచ్చేసింది. ఛస్ ఒక్క చిన్నముక్క కూడా రావడం లేదు అని బాధపడ్డారు. అదే ముక్కని పేపర్ మీద పెట్టి చూడండి గురువుగారు అన్నారు చక్రవర్తి. చిన్న ముక్క చిన్న ముక్క అని రాసుకున్నారు వేటూరి. నిమిషం పాటు ఇద్దరు మొహాలు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో చిరువదనం. వేటూరి వెంటనే దాన్ని మార్చి చిన్న మాట... ఒక చిన్నమాట అన్నారు. ఎగిరి గంతేశారు చక్రవర్తి. అంతే పాట తయారైంది. సరిగ్గా గంటలో ట్యూన్ కూడా అయింది. శాస్ర్తీయ సంగీతంలో కాకలు తీరకపోయినా రాగాలతో చక్రవర్తి చేసిన ప్రయోగాలు అనన్య సామాన్యాలు. మోహన అనగానే మనకు టక్కున ఇదాలోకం లోని నీ మనసు నా మనసు ఏకమై పాట గుర్తుకొచ్చి తీరుతుంది. అలాగే మాల్‌కౌస్.. అదే హిందోళమంటే చాలు... జేబుదొంగలోని రాధా అందించు నీ లేత పెదవి పాట అసంకల్పితంగానే పెదవులై మెరుస్తుంది. భీంప్లాస్‌లో శ్రీమతి గారికి తీరని వేళ .. కుశలమా నీకు కుశలమేనా పాటలు గుర్తుకు రాకుండా వుండవు. యమన్ కళ్యాణ్‌లో మన్నించుమా ప్రియా... మాల్‌కౌస్, జయజయావంతి, చారుకేశి, సారంగ రాగాలలో ఆడవే అందాల సురభామిని.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే వుండదు. చారుకేశి రాగాన్ని పాపులర్ చేసింది చక్రవర్తే. అసలు ఈ రాగాన్ని మాస్టర్ వేణుగారు తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ రాగాన్ని అంటుకోడానికి సాహసించలేదు. చక్రవర్తి చాలా పాటలను ఇందులో కంపోజ్ చేసి భేష్ అనిపించుకున్నారు. ఏటి ఒడ్డున నిలుచుంటే పాట ఒక్కటి చాలు.. చక్రవర్తికి చారుకేశి మీదున్న పట్టును తెలియచెప్పటానికి. యమగోలలో ఆడవే అందాల సురభామినీ కూడా చారుకేశీ రాగంలో కంపోజ్ చేసిందే. వేటూరి గడుసరి పాట పిల్లకు సరైన మొగుడు చక్రవర్తే. దర్శకుడి ఆలోచనాసరళికి అనుగుణంగా ఆయన పాట రూపుదిద్దుకునేది. రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటలు ఓ రకంగా వుంటే... జంధ్యాల సినిమాల్లోని పాటలు మరో రకంగా వుండేవి. విశ్వనాథ్ సినిమా పాటలు ఇంకో రకంగా వుండేవి. మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా వున్న సమయంలోనూ చక్రవర్తి చాలా మంది నటులకు స్వరాన్ని అరువిచ్చారు. ఊర్శశిలో సంజీవ్ కుమార్‌కి.. కల్పనలో వరప్రసాద్‌కి.. మన్మథలీల, ప్రేమపూజారిలలో కమల్‌హాసన్‌కి.. ప్రేమలేఖలులో అనంత్‌నాగ్‌కి.. ఆమెకథలో రజనీకాంత్‌కి... సీతాకల్యాణంలో రాముడి పాత్ర వేసిన రవికి... మనీలో పరేష్ రావల్‌కి చక్రవర్తే డబ్బింగ్ చెప్పాడు. అంతే కాదు తన నటనాపటిమతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగలిగారు. గోపాలరావుగారి అమ్మాయిలో చెవిటి లాయర్‌గా.. పక్కింటి అమ్మాయిలో సంగీత మాస్టారిగా.. ఆమెకథలో బీమా ఏజెంట్‌గా... అల్లరి బుల్లోడులో రేషన్ ఆఫీసర్‌గా.... సీతాపతి సంసారంలో తిండిపోతు ఆఫీసర్‌గా.. అతనికంటే ఘనుడులో మోటార్ షాపు యజమానిగా.. గజదొంగలో కానిస్టేబుల్‌గా చక్రవర్తి చక్కగా నటించారు. ఎనిమిదో దశకం మధ్య వరకు అప్రతిహతంగా సాగిన చక్రవర్తి జైత్రయాత్రకు ఒక రకంగా ఇళయరాజా అడ్డుకట్ట వేశాడనే చెప్పుకోవచ్చు. వెయ్యి సినిమాలన్నా పూర్తి చేయాలన్నది చక్రవర్తి కోరిక. ఆ కోరిక తీరకుండానే చక్రవర్తి వెళ్లిపోయారు. ఆయన సంగీతం వేయి సినిమాలను పూర్తి చేసుకోలేదేమోగానీ, వెయ్యేళ్లు వర్ధిల్లగలిగేంతటిది. ఆయన పాటలు పాతజ్ఞాపకాల్ని మన మనసుల్లో తట్టి లేపుతూనే ఉన్నాయి. చక్రవర్తి చల్లిన సరిగమల విత్తనాలు ఎన్నో పుష్పించి ఇప్పటీకీ ఎప్పటికీ పరిమళిస్తాయి.

Comments
Post a Comment